టీఎస్ ఆర్టీసీ కండక్టర్ల ఐక్య వేదిక
తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కండక్టర్లకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఈ నెల 23న హైదరాబాద్ పట్టణంలోని వి ఎస్ టి ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కండక్టర్ల మహాసమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కండక్టర్ల ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి తమటం విజయకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు.
కండక్టర్ల ఐక్యవేదిక ఏ యూనియన్ కు అనుకూలం కాదని, వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. టిక్కెట్ తీసుకుని పూర్తి బాధ్యత ప్రయాణికుడిదే ఉండాలని, కండక్టర్లకు సంపూర్ణ ఉద్యోగ భద్రత ఉండాలని, ఇంక్రిమెంట్ కోతలు లేని,డిపో స్పేర్ లేని, సస్పెండ్ లేదా రిమూవల్ లేని ఉద్యోగ భద్రత ఉండాలని డిమాండ్ చేశారు.
1963లో రాసిన ఆర్టీసీ నియమనిబంధనలు నేటి కాలానికి, న్యాయానుకూలంగా మార్పులు చేయవలసిన అవసరం ఉందని, ఆర్టీసి రెగ్యులేషన్స్ ను మార్పులు చేయడం ద్వారానే కండక్టర్లకు, ఆర్టీసీలోని మిగతా కార్మికులకు ఉద్యోగభద్రత లభిస్తుందని తెలియజేశారు. రైల్వే, విమానయాన సంస్థల్లో లాగా టిక్కెట్లు లేని ప్రయాణికునికి జరిమానా విధించాలన్నారు.
కండక్టర్ల సమ్మేళనం విజయవంతం చేసేందుకు మంగళవారం వీక్లీ ఆఫ్ లు, స్పెషల్ ఆఫ్ లు ఉన్న కండక్టర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్టీసీ లోని వివిధ అన్ని యూనియన్ల జనరల్ సెక్రటరీలు, హక్కుల సంఘాల నాయకులు, రాజకీయ విశ్లేషకులు పాల్గొని ఐక్యవేదికకు మద్దతు పలుకుతారని, వారితో పాటు రాష్ట్రంలోని అన్ని డిపోల కండక్టర్లు పాల్గొంటారని తెలిపారు.
సమ్మేళనం కు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అచ్చంపేట డిపో ఐక్యవేదిక నాయకులు గోపాల్, ఆర్.ఎస్.నారాయణ, ఎం.ఎస్.నారాయణ, బాబా షరీఫ్, నరహరి, తిరుపతయ్య, విజయ్ కుమార్,కె.ఎస్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.