రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెడితే ఎంత ఖర్చవుతుంది ?
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. గంపెడన్ని ఆశలతో నాలుగున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్.. తాను ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని అమలు చేసింది అనే విషయాన్ని పక్కనబెడితే ఈ బడ్జెట్‌ను ఆయన పూర్తిస్థాయిలో వాడాలనుకుని డిసైడ్ అయినట్టు ఉన్నారు. అందుకే ఓట్ ఆన్ అకౌంట్‌లో కూడా ఓట్ బ్యాంక్ కోసం వినియోగించే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఓ వైపు రుణభారం పెరుగుతోంది.. మరోవైపు వృద్ధి అంతంమాత్రంగా ఉంది.. ఇదీ ఇప్పుడు దేశ ఆర్థిక స్థితి. 2014లో అధికారంలోకి అడుగుపెట్టిన మోడీకి అప్పుడది ఓ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోవడంతో ఆర్థిక భారం అనూహ్యంగా తగ్గింది. మరోవైపు అనేక సంక్షేమ పధకాలకు ఆధార్ లింక్ చేయడంతో సబ్సిడీ భారం బాగా కలిసొచ్చింది. అయితే అప్పటి నుంచి కేంద్రం తీసుకున్న అనేక నిర్ణయాలు రివర్స్ అవుతూ వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బెడిసికొట్టింది, జీఎస్టీ అమలు ఆలస్యమైంది.