మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం..

0
Share

దేశమంతా వినాయక చవిత ఉత్సవాలకు సిద్ధమవుతోంది. పండగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది. జాగ్రత్తగా గమనిస్తే.. ప్రతి పండగ వెనకా ఓ మహోన్నత లక్ష్యం కనిపిస్తుంది. ప్రకృతిలో మమేకమవుతూ నేలా-నీరు, చెట్టూ – పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం అనాధిగా మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వస్తోంది. నిజానికి ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పదనం. కాబట్టి ఈ వినాయక చవితి ఉత్సవాల నుంచే కొత్త ఒరవడికి శ్రీకారం చుడదాం.. కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దాం..

వివిధ రకాల కెమికల్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతోంది. మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం మంచిది కాదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు.. మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం తీసుకోవచ్చు. గొప్పలకు పోయి మనకు మనమే నష్టం చేసుకునేకంటే.. ఉన్నంతలో పండగ చేసుకొని పది మందికి మంచిని పంచిపెట్టడం మేలు.
పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ నడుస్తోంది. దీనికి అంత ప్రాధాన్యం వచ్చిందంటే.. మనవల్ల ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం చేసే పనుల వల్ల ఎదుటివారికి ఏ చిన్న కష్టం రాకూడదు. మన పండగల పరమార్థం కూడా ఇదే.

మనుషులను, మూగ జీవాలను ఇబ్బందులకు గురి చేయమని ఏ దేవుడూ చెప్పలేదు. చేతనైతే ఇంత సాయం చేయాల్సింది పోయి.. తెలిసీ తెలిసీ ఇతరులను ఇబ్బందుల్లో పడేద్దామా..? మట్టి గణపతులను పూజించడంతోనే సరిపోదు.. రోడ్లన్నీ మూసుకుపోయేలా అడ్డదిడ్డంగా మండపాలు నిర్మించి, సామాన్య మానవుడికి ఇబ్బందులు తెచ్చే పనులకు కూడా చరమగీతం పాడాలి. కాలనీ వాళ్లంతా కలసి ఒకే గణపతిని పెట్టుకుంటే.. దేవుడు దీవించడా? ఊరు వాళ్లంతా కలిసి ఒక్కటే విగ్రహాన్ని పూజిస్తే గణపతి ఊరుకోడా?

మట్టి గణపతులను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తీవ్ర కృషి చేస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మరో ఉద్యమంలా ఉరుకులు పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎలాంటి మంచిపనికైనా మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆచరిస్తే పెద్ద కష్టమైన పనేం కాదిది. భూమిని చీల్చుకొస్తూ పుట్టే మొలక పచ్చని మొక్కలా ఎదిగినట్టు.. ఒక మంచి పండగ సందర్భంగా మొగ్గ తొడిగిన ఈ ఆలోచన ఉన్నత ఆశయాల దిశగా ఎదిగేట్టు ఇప్పుడే ప్రయత్నం ప్రారంభిద్దాం..


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *