పెరుగుతున్న టమాటా ధరలు
దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. కిలో టమాటా ధర దగ్గరదగ్గరగా రూ. 80 వరకు పలుకుతోంది. ఒకప్పుడు టమాటాకు గిట్టుబాటు ధర లభించక రైతన్న కిలోను ఒక్క రూపాయికే అమ్ముకోవాల్సిన దుస్థితి రావడంతో పండించిన పంటను అలానే ఆగ్రహంతో రోడ్డుపైనే పడేసేవాడు. ఇప్పుడు అదే టమాటా సామాన్యుడి ఇంట్లో కనిపించడం లేదు. దీనికి కారణం ధరల పెరుగుదలనే.
కూరల్లో టమాటా లేకుంటే రుచే ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే కూరల్లో కింగ్ లాంటిది టమాటా. ఎర్రగా నిగనిగ లాడే ఈ టమాటా సామాన్యుడకి అందుబాటులో లేకుండా పోతోంది. అంటే దీని ధర ఇంకా ఎర్రగా మండుతోంది. దీంతో సామాన్యుడు టమాటా మాట మాట్లాడాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఒకప్పుడు కిలో రూపాయి పలికిన ఈ కూరగాయ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో రూ. 80 వరకు పలుకుతోంది. టమాటా ధరలు ఒక్కసారిగా పెరగడానికి కారణమేంటి..?
కిలో టమాటా కొనేందుకు భయపడుతున్న సామాన్యుడు
టమాటా మాట మాట్లాడాలంటేనే భయపడుతున్నారు సామాన్యులు. వర్షాలు సరిగ్గా పడకపోవడం సమయానికి పంట చేతికి రాకపోవడంతో టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఉత్తర భారతంలో కిలో టమాటా ధర ఏకంగా రూ.80 పలుకుతోంది. దీంతో వెండార్లు టమాటాలను రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసినప్పటికీ సామాన్యుడు వీరి దగ్గర నుంచి కొనుగోలు చేయడం లేదు. భారతదేశంలో టమాటా పంట రాబడి వాతావరణం కురిసే వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో టమాటా పంట మొత్తం ధ్వంసం అయ్యింది. దీంతో చేతికందివచ్చిన పంటనే బంగారంలా అమ్ముకుంటున్నారు.