• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

తొలి ఏకాదశి విశిష్టత

Share Button

మన మొట్టమొదటి పండగ తొలి ఏకాదశి. ఈ పండగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఆనందంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే పండగ ఇది. Toli ekadasi of 2020

toli ekadasi of 2020

హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. బుధవారం (జులై 01) తొలి ఏకాదశి సందర్భంగా.. ఈ పండగ విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాం..

ఒక ఏడాదిలో 24 ఏకాదశుల్లో వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు.

ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.

పూజకు పూజ.. ఆరోగ్యానికి ఆరోగ్యం

ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగానూ మనకు మేలు చేస్తుందన్నమాట.

Toli ekadasi of 2020

ఏకాదశి తిథి:

కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు.. బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట. నాటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు రుషులు చెబుతారు.

ఏకాదశి పర్వదినాన ఏం చేయాలి?

ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు.

పేలాల పిండి వెనుక ఆరోగ్య రహస్యం ఇదే.

తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత.

వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat