ఆదివారం నుంచి ప్రారంభం.. 3వ తేదీ వరకు కంటిన్యూ..
పోలియో డ్రాప్స్: ఆదివారం నుంచి ప్రారంభం.. 3వ తేదీ వరకు కంటిన్యూ..
పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రారంభం కానుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు పోలియో కొనసాగనుంది. హైదరాబాద్‌లో మాత్రం ఫిబ్రవరి 3 వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపడుతారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 38,31,907 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. 23 వేల 331 కేంద్రాల ద్వారా పోలియో చుక్కల పంపిణీ కొనసాగనుంది. పోలియో ఫ్రీ దేశంగా భారత్ పదేళ్లు పూర్తి చేసుకుంది. pulse polio drops in achampet
ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటలకు చుక్కల మందు వేయనున్నారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమం జరగనుంది. జనవరి 17 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జనవరి 16 నుంచి ప్రారంభం కావడంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
హైదరాబాద్ నగరంలో చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 5లక్షల 15వేల 520మంది పిల్లలకు టీకా వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం దేశవ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే.
అన్ని రాష్ట్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే చిన్నారులకు పోలియో చుక్కలు వేయరాదని ఆరోగ్యశాఖ సూచించింది. లక్షణాలు తగ్గిన తర్వాత చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులకు సూచించింది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2021 మొదటి దశ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్‌లో ఐదేళ్లలోపు చిన్నారులకు శనివారం సాయంత్రం పోలియో చుక్కలు వేశారు. దీంతో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే తదితరులు పాల్గొన్నారు. pulse polio drops in achampet
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin