లాక్‌డౌన్ వద్దనే అభిప్రాయానికి ప్రభుత్వం.
లాక్‌డౌన్ వద్దనే అభిప్రాయానికి ప్రభుత్వం.
జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మళ్లీ కఠిన లాక్‌డౌన్ విధించాలనే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకున్నట్టు తెలుస్తోంది. 15 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చేసిన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చించి మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గత నెల 28న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దాదాపు వారం రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ విషయంలో మళ్లీ ఎలాంటి ప్రకటన లేకపోవడంతో హైదరాబాదీలతోపాటు నగర వ్యాపార, వాణిజ్యవర్గాల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. No lockdown in hyderabad
మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత అధ్యయనం నిర్వహించింది. వైద్యరంగ నిపుణులతో పాటు రాజకీయ నేతలు, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు, సాధారణ ప్రజల నుంచి అభిప్రా యాలు సైతం సేకరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో లాక్‌డౌన్ విధించడమే సరైందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా, ఎక్కువ మంది ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించినట్టు సమాచారం. లాక్‌డౌన్ ఎంత కఠినంగా అమలు చేసినా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టలేమని ఇప్పటికే తేలిపోయిం దని చాలా మంది వైద్య నిపుణులతో పాటు వివిధ రంగాల వ్యక్తులు ప్రభుత్వానికి సూచనలు చేసినట్టు చర్చ జరుగుతోంది.
కేబినెట్ భేటీ ఊసే లేదు.
No lockdown in hyderabad
రాష్ట్రమంత్రివర్గాన్ని సమావేశపరిచి లాక్‌డౌన్‌పై మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించి వారం రోజులు గడిచిపోయింది. అసలు మంత్రివర్గ భేటీ ప్రతిపాదనలే ఇప్పటివరకు లేవని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు సైతం స్పష్టం చేశాయి. మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచనే లేదని, ప్రస్తుతం అన్‌లాక్ దశలో ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ సైతం సీఎం కేసీఆర్‌కు ఇటీవల ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలియజేశారు. దేశం అంతటా అన్‌లాక్ అవుతున్న తరుణంలో మళ్లీ హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తే ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ వ్యాపార, వాణిజ్యపరంగా తీవ్రంగా నష్టపోయే అవకాశముందని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
వ్యాక్సిన్‌పై ఆశలు.
ఆగస్టు 15 నాటికి దేశంలో కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఐసీఎంఆర్ తీవ్రంగా కృషి చేస్తోంది. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్‌తో కలిసి వ్యాక్సిన్ తయారీకి విస్తృతంగా కృషి చేస్తోంది. సాధ్యాసాధ్యాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నా… ప్రభుత్వం ఈ తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఇక లాక్‌డౌన్ విధించే అవకాశం లేనట్టే అని కొందరు పభుత్వ అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin