ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ ఓటు గల్లంతే..!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ ఓటు గల్లంతే..!
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటింగ్‌కు సమయం దగ్గరవుతోంది. బరిలో భారీ సంఖ్యలో అభ్యర్థులుండడంతో ఓటు వేసే విధానంపై పలువురు గ్రాడ్యుయేట్ ఓటర్లలో అయోమయం నెలకొంది. దానికి తోడు గత 2015 ఎమ్మెల్సీ ఎన్నికల నాటితో పోలిస్తే.. కొత్తగా నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్ ఓటర్ల సంఖ్య కూడా భారీగానే వుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అయితే ఏకంగా రెండింతలకు పైగా పెరిగారు గ్రాడ్యుయేట్ ఓటర్లు. దానికి తోడు అభ్యర్థుల సంఖ్య మూడింతలు అయింది.
అటు వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలోను ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలోనే వున్నారు. అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ వుండడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకమవుతాయన్న అంఛనాలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వోటు వేసే విధానంపై అభ్యర్థులు, రాజకీయ పార్టీలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో మొదటి ప్రాధాన్యత ఓటు వేయలేకపోతే.. కనీసం రెండో ప్రాధాన్యత ఓటైనా వేయాలని అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేప్పుడు తప్పనిసరిగా కొన్ని అంశాలను తెలుసుకోవాలి. అవేంటంటే..?
- బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. రాజకీయ పార్టీల తరపున వారు పోటీ చేస్తున్నా కూడా… వారి పేర్ల పక్కన పార్టీల సింబల్స్ (గుర్తులు) ముద్రించరు. పార్టీల అభ్యర్థులు గెలిస్తే వారికిచ్చే ధ్రువపత్రంలో వారు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది మాత్రం మెన్షన్ చేస్తారు.
- ప్రాధాన్యత ప్రాతిపదికన ఓట్లు వేయాల్సి ఉంటుంది. తాము ఎవరికైతే ఓటు వేయదలచుకున్నారో వారి పేరు పక్కన ఉన్న బాక్సులో 1 నెంబర్ వేయాలి. టిక్ మాత్రం చేయకూడదు. అలాగే ఇతరత్రా మరే పద్ధతిలోనూ ఓటును మార్క్ చేసినా అది చెల్లదు. నెంబర్ మాత్రమే వేయాలి. అక్షరాల్లో రాసినా కూడా ఓటు చెల్లదు.
- పోటీలో ఎంత మంది అభ్యర్థులు ఉంటే… ఓటరు అన్ని ప్రాధాన్యత ఓట్లు వేయవచ్చు అంటే ఉదాహరణకు ఈసారి హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరికి తమ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు… అంటే 1, 2, 3, 4…. ఇలా అభ్యర్థుల పేర్ల పక్కన తాము వారికిచ్చే ప్రాధాన్యతను నెంబర్ రూపంలో వేయవచ్చు. అలా 93 వరకు ప్రాధాన్యతలు ఇచ్చే వీలుంది.
- మొదటి ప్రాధాన్యత (నంబర్ 1) ఇవ్వకుండా… మీరెన్ని ప్రాధాన్యతలు ఇచ్చినా ఆ ఓటు చెల్లదు.
- ఒక్కరికే తొలి ప్రాధాన్యత ఓటు వేసి ఆపేయవచ్చు లేదా తాము ఎన్ని అనుకుంటే అన్ని పాధాన్యత ఓట్లు వేసి ఆపేయవ చ్చు. అయితే ప్రాధ్యానతను ఇచ్చే క్రమంలో వరుస తప్పకూడదు. ఉదాహరణకు మొదటి ప్రాధాన్యతకు 1 ఇచ్చి తర్వాత క్రమం తప్పి 3, 4, 5 వేస్తూ పోయారనుకోండి… అప్పుడు ద్వితీయ ప్రాధాన్య త ఓట్లను లెక్కించాల్సిన అవసరం వస్తే మీ ఓటు చెల్లదు. మొదటి ప్రాధాన్యత వరకే మీ ఓటును పరిగణనలోని తీసుకొని ఆ తర్వాత పక్కన పడేస్తారు.
- ఒకే నంబరును ఇద్దరు అభ్యర్థులకు ఇచ్చినా ఓటు చెల్లకుండా పోతుంది.
- బ్యాలెట్ పేపరుపై అంకెలు వేయడానికి పోలింగ్ స్టేషన్‌లో ఇచ్చే స్కెచ్ పెన్‌నే వాడాలి.
- బ్యాలెట్ పేపర్‌పై పేర్లు రాయడం, సంతకం చేయడం, వేలిముద్ర వేయడం… చేయకూడదు. అంకెలతో ఓటు ను మార్క్ చేయడం తప్పితే బ్యాలెట్‌పై ఏం రాసినా దాన్ని చెల్లని ఓటుగా భావించి పక్కన పెడతారు.
- విధి నిర్వహణలో భాగంగా ఇతర ప్రదేశాల్లో ఉంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు వేయవచ్చు. దీనికి నిర్ణీత విధానాన్ని ఫాలో కావాల్సి వుంటుంది. అధీకృత అధికారి అటెస్టేషన్ అవసరం
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin