మార్చిలో ఎన్నికలు.. గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ వేడి..!

మార్చిలో ఎన్నికలు.. గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ వేడి..!
స్థానిక సంస్థల ఎన్నికలను పదో తరగతి పరీక్షల ఆరంభానికి ముందే నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఆగ మేఘాలపై ఏర్పాట్లు సన్నద్ధం చేస్తున్నారు. గ్రామపంచాయతీలకు సంబంధించి సర్పంచుల పదవీకాలం ముగిసి సంవత్సరం పూర్తి కావడం, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసి దాదాపుగా ఆరు నెలలు పూర్తి కావస్తుండగా మున్సిపాలిటీల పాలకమండల పదవీకాలం ఇటీవల ముగిసిన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు. వేస్తుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి విస్తృతంగా నియోజకవర్గాలలో పర్యటనలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీ, ఇతర ముఖ్య నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి సత్తా చాటాలన్న సంకల్పంతో వ్యూహరచనలు చేస్తున్నారు.
ఏకకాలంలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు..
సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఉమ్మడి పాలమూరు ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సన్నద్ధం అవుతున్నట్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెల్లడించారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఇటీవల రేషన్ కార్డులు, తదితర పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన నేపథ్యంలో పార్టీకి పరిస్థితులు అనుకూలిస్తాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్నట్లు అధికార పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పది పరీక్షలకు ముందే..
పదో తరగతి పరీక్షలకు ముందే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ లో వివిధ పరీక్షలు ఉండడం.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంవల్ల ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్న ఉద్దేశంతో పదో తరగతి పరీక్షలు ఆరంభం కాకముందు గాని మార్చి రెండవ వారంలో నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూలు ఈనెల రెండవ వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. షెడ్యూలు వచ్చేలోపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తో ప్రజల్లోకి మరింతగా వెళ్తామని అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
జూలై తర్వాతే మునిసిపాలిటీ ఎన్నికలు..
మార్చిలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తప్పనిసరిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మునిసిపాలిటీ ఎన్నికలు మాత్రం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే జూన్ లేదా జూలై తర్వాత జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు మునిసిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin