Drum seeder in palkapally village | పలుక పల్లి గ్రామంలో వరి విత్తన గొర్రు
పలుక పల్లి గ్రామంలో వరి విత్తన గొర్రు Drum seeder usage in palkapally village
డ్రమ్ సీడర్ తో వరి విత్తు పద్ధతి :
వాతావరణంలో వస్తున్న మార్పుల మూలంగా వర్షాలు సకాలంలో కురవక, నార్లు పోయడం మరియు నాట్లు వేయడం ఆలస్యం అవడం వల్ల వరి దిగుబడులు తగ్గుతున్నాయి. దీనివలన నారును నెల రోజుల పాటు పెంచి నారు పీకి నాటు వేయడానికి అధిక ఖర్చు అవడమే కాక నీటి వాడకం కూడా అధికమవుతుంది. ఈ నేపథ్యంలో డ్రమ్ సీడర్ తో వరి సాగు చేయుట ఒక ప్రత్యమ్నాయ పద్ధతి. డ్రమ్ సీడర్ తో వరిని నేరుగా పొలంలో విత్తుకోవచ్చును.
డ్రమ్ సీడర్ తో సాగు – ఉపయోగాలు:
డ్రమ్ సీడర్ పద్దతిలో నార్లు పెంచి, నాటు వేసే అవసరం లేదు. కాబట్టి నాటుకు అవసరమైన కూలీల ఖర్చును ఆదా చేయవచ్చు. Drum seeder usage palkapally village
విత్తన మోతాదును సగానికి సగం తగ్గించవచ్చు. డ్రమ్ సీడర్ పద్ధతిలో విత్తినప్పుడు ఒక చదరపు మీటరుకు ఉండవలసిన మొక్కల సంఖ్య ఖచ్చితంగా ఉండడం వల్ల వరి దిగుబడులు నాటు వేసిన వరికన్నా అధికంగా ఉంటాయి. వర్షాలు ఆలస్యమై నీరు సకాలంలో అందనపుడు కాలువల ద్వారా నీటి విడుదల ఆలస్యమైనప్పుడు ముదురు నార్లతో నాట్లు వేయడం జరుగుతుంది. దీనివల్ల వరిలో దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. అలాంటి పరిస్థితుల్లో డ్రమ్ సీడర్ పద్ధతి అనువుగా ఉంటుంది. సాళ్ల మధ్యలో యంత్రాలతో అంతరకృషికి వీలుంటుంది. నాటువేసిన వరి కన్న 7 – 10 రోజులు ముందుగా డ్రమ్ సీడర్ తో వేసిన వరి కోతకు వస్తుంది.
నేల తయారీ:
డ్రమ్ సీడర్ తో వరి నాటేటప్పుడు సాధారణ పద్దతిలో కంటే వీలైనంత బాగా చదును చేసుకోవాలి. ఎత్తు పల్లాలు లేకుండా సమాంతరంగా ఉండడం చాలా అవసరం. పొలంలో నీరు నిలువ ఉండకూడదు కాబట్టి నీరు ఎక్కువైతే బయటకి పోవటానికి ఏర్పాట్లు చేయాలి. పెద్దగా ఉన్న పొలాలను చిన్న మడులుగా విభజించుకుంటే చదును చేయడానికి నీరు పెట్టడానికి, విత్తనం చల్లడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. విత్తే సమయానికి నీరు లేకుండా బురద ఉంటే చాలు. ఇసుక శాతం ఎక్కువగా ఉన్న నేలలో విత్తలనుకున్న రోజే ఆఖరి దమ్ము చేసి చదును చేసి పలుచటి నీటి పొర ఉండేటట్లు చూసుకోవాలి. బంక నేలల్లో ఆఖరి దమ్ము చేసి చదును చేసిన మరుసటి రోజు విత్తుకోవచ్చును.
విత్తన మోతాదు:
రకాన్ని బట్టి ఎకరాకు 10 – 15 కిలోలు అవసరమవుతాయి. కాండం గట్టిగా ఉండి వేరు వ్యవస్థ ధృడంగా ఉండి పడిపోని రకాలు మిక్కిలి అనుకూలం. ఆయా ప్రాంతానికి అనువైన, రైతుకు ఇష్టమైన ఏ రకమైనా ఈ పద్ధతిలో సాగు చేసుకోవచ్చును.
విత్తన శుద్ధి:
డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునేటప్పుడు లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్ కలిపినా ద్రావణంలో విత్తనాలను 12 గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టి కొద్దిగా ముక్కు పగిలిన గింజలను వాడుకోవాలి.
విత్తే దూరం:
డ్రమ్ సీడర్ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి. గింజలు రాలడానికి వీలుగా ప్రతి డ్రమ్ లో కేవలం 3/4 వంతు మాత్రమే మొలకెత్తిన గింజలను నింపాలి. గింజలు నింపిన డ్రమ్ సీడర్ లాగితే 8 వరుసల్లో వరుసకు వరుసకు మధ్య 20 సెం. మీ. దూరంలో గింజలు పడతాయి. వరుసల్లో కుదురుకు కుదురుకు మధ్య దూరం 5 – 8 సెం. మీ. ఉంటుంది. ఒక్కో కుదురులో 5 – 8 గింజలు పడటం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కుదురులోని గింజలు 50 శాతం దెబ్బతిన్నా మిగిలిన 50 శాతం గింజల నుండి వచ్చిన మొక్కల సాంద్రత సరిపోతుంది. రకాన్ని బట్టి గింజలు పడటాన్ని బట్టి రంధ్రాలను స్టాపర్స్ తో మూసుకోవాలి. సన్న గింజ రకాలకు రంధ్రం వదిలి రంధ్రం మూసివేయాలి. 16 వరుసలకు అడుగు వెడల్పు కాలిబాటలు ఉంచుకోవాలి. తాడును వినియోగించి డ్రమ్ లాగితే వరుసలు బాగా వస్తాయి. కోనోవీడర్ తిప్పడానికి వీలుగా ఉంటుంది.
ఎరువుల యాజమాన్యం :
ఆయా ప్రాంతాలకు మరియు రకాలకు సిఫార్సు చేసిన ఎరువులనే డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగు చేసిన వరికి వాడుకోవాలి.
పూర్తి భాస్వరం మరియు సగం పొటాష్ ఎరువులను ఆఖరి దమ్ములో వేయాలి. మిగిలిన పొటాష్ ను చిరు పొట్ట దశ లో నత్రజని ఎరువులతో కలిపి వేసుకోవాలి.
దమ్ములో అధిక నత్రజని ఎరువులు వేసినప్పుడు కలుపు ఎక్కువగా వస్తుంది. నత్రజని ఎరువును 3 సమ భాగాలుగా చేసి 1/3 వ భాగం విత్తిన 15 – 20 రోజులకు మిగతా రెండు భాగాలను పిలక దశలో (విత్తిన 40 – 45 రోజులకు) మరియు చిరుపొట్ట దశలో ( 60 – 65 రోజులకు) వేసుకోవాలి. సాధారణంగా ఒక ఎకరా వరికి 48 కిలోలు నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వాడుకోవాలి. రైతుల భాషలో చెప్పాలంటే దమ్ములో ఒక బస్తా డి. ఎ. పి, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకొని, విత్తిన 15 రోజులకు పిలక దశలో మరియు చిరుపొట్ట దశలో ఎకరాకు 32 కిలోల చొప్పున యూరియా చల్లుకోవాలి. ఆఖరి దఫా యూరియాతో పాటు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ తప్పనిసరి.
కలుపు యాజమాన్యం:
ఎకరాకు ప్రెటిలాక్లోర్ + సేఫ్ నర్ మందును 600 – 800 మి. లీ. విట్టిన 3- 5 రోజుల లోపు లేదా పైరజోసల్ఫ్యూరాన్ ఈథైల్ 80 – 100 గ్రా. లేదా బ్యుటాక్లోర్ 1 – 1.5 లీ. లేదా ప్రెటిలాక్లోర్ 500 మి. లీ. లేదా ఆక్సాడయార్జిల్ 35 – 45 గ్రా., 8 – 10 రోజులలో ఇసుకలో కలిపి పలుచటి నీటిపొర ఉంచి చల్లాలి. ఎకరాకు సైహలోఫాప్ పి బ్యుటైల్ 300 మి. లీ. (ఊద. ఒడిపిలి)లేదా ఫినాక్స్ ప్రాప్ పి ఇథైల్ 250 – 300 మి.లీ. విత్తిన 15 రోజులకు లేదా బిస్ పైరిబాక్ సోడియం 100 మి. లీ. విత్తిన 20 రోజులకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బిస్ పైరిబాక్ సోడియం వెడల్పాకు గడ్డి జాతిని కూడా అరికట్టును. వెడల్పాకు కలుపు నివారణకు 2,4 – డి సోడియం సాల్ట్ ఎకరాకు 400 గ్రా. విత్తిన 25 – 30 రోజులకు పిచికారీ చేయాలి. పంట దశను, కలుపు రకాన్ని బట్టి కలుపు మందును ఎంచుకోవాలి.
నీటి యాజమాన్యం:
విత్తిన తరువాత మొదట్లో నీరు లేకుండా బురదగా మాత్రమే ఉంచాలి. నీరు నిల్వ ఉన్న చోట మొలక రాదు. ఆ తర్వాత పలుచగా నీరు ( 2- 3 సెం.మీ. ) పిలకలు తొడిగే దశ వరకు ఉంచితే సరిపోతుంది. పైరు పొట్ట దశ నుండి పంట కోసే 7 – 10 రోజుల వరకు నాటువేసిన పొలం మాదిరిగానే నీటి యాజమాన్యం పాటించాలి.
డ్రమ్ సీడర్ తో సాగు – అవరోధాలు:
డ్రమ్ సీడర్ పద్ధతి చౌడు నేలలకు, నీటి ముంపుకు గురి అయ్యే ప్రాంతాలకు అణువు కాదు.
పొలం ఎత్తు వంపులు లేకుండా చదునుగా ఉండాలి లేనట్లయితే నీరు నిల్వ ఉండి మొలక మురిగి, మొక్కల సంఖ్య తగ్గిపోతుంది. విత్తిన తరువాత భారీ వర్షం వచ్చినట్లయితే విత్తనాలు కొట్టుకుపోయే అవకాశం ఉంది. డ్రమ్ సీడర్ పద్దతిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కలుపు నివారణ అనివార్యం.
Dr.K. లక్ష్మణ్ సింగ్
వ్యవసాయ విస్తరణ అధికారి
అచ్చంపేట.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin