9న నల్లమల బంద్
నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఈనెల 9వ తేదీన అమ్రాబాద్ మండలంలో స్వచ్చందంగా బంద్ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ మరియు యూనియన్ వ్యతిరేక కమిటీ కన్వీనర్ దాసరి నాగయ్య తెలియజేశారు.ఈనెల 9వ తేదీన యు సి ఎల్ కంపెనీ వారు అమ్రాబాద్ పది మండలాల్లో 4000 బోర్లు వేస్తున్న నేపథ్యంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ స్వచ్ఛందంగా బంద్ పాటించనున్నామని తెలియజేశారు.
దేశానికే తలమానికమైన నల్లమల్లను ముగ్గురు త్రిమూర్తులు… స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమ్ముకుంటున్నారని డా.వంశీ కృష్ణ తీవ్ర భావోద్వేగంతో ద్వజమెత్తారు.నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతినిస్తూ సంతకం పెట్టింది మీరు కాదా?పోలీసులు, ఫారెస్ట్ అధికారుల అండదండలతో మీ సతీమణి నల్లమలలోని పురాతన ఆలయాలలో వజ్రాలు, బంగారం కోసం గుప్త నిధుల అన్వేషణ కొనసాగించింది నిజం కాదా? అని స్థానిక ఎమ్మెల్యే బాలరాజు అని ప్రశ్నించారు.
యురేనియం వ్యతిరేక కమిటీ కన్వీనర్ దాసరి నాగయ్య మాట్లాడుతూ…నల్లమల్ల ప్రజలు పార్టీ జెండాలు పక్కనపెట్టి ఐక్యతతో పోరాడి నల్లమలను రక్షించుకుందామని పిలుపునిచ్చారు.
నల్లమల్ల యురేనియం వ్యతిరేక రాజకీయ జేఏసీ కన్వీనర్ నాసరయ్య మాట్లాడుతూ…నల్లమల్ల అప్పయ్య అరణ్యంలోని వన్యప్రాణులను జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు నడుంబిగించాలని,నల్లమలకు అద్భుతమైన చరిత్ర ఉందని ఈ అడవులు రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు పరిపాలించిన ప్రాంతమని,కన్నతల్లి లాంటి ఈ నల్లమలను యురేనియం పేరుతో విధ్వంసం సృష్టించడం చట్టవిరుద్ధమని ఆయన అన్నారు.
అనంతరం రాస్తారోకో నిర్వహించి, రోడ్డుపై బైఠాయించగా పోలీసులు అమ్రాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.