లంచమివ్వలేదని గేదెను పట్టుకెళ్లారు
ఎక్కడికి వెళుతోంది ఈ సమాజం.కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని,విస్మయని,ఆందోళనను కలిగిస్తే మరికొన్ని నవ్వును తెప్పిస్తాయి.అదే వార్త ఇది.
మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా సిరోంజ్‌కి ప్రాంతంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కొందరు అధికారుల లంచగొండితనానికి ఇది పరాకాష్టగా నిలిచింది. స్థానిక నాయిబ్ ప్రాంతానికి చెందిన తహశీల్దారుకు లంచమివ్వలేదని ఓ వ్యక్తికి చెందిన గేదెను కారుకు కట్టేసి తీసుకెళ్లారు.
తమ భూమికి సంబంధించిన వివరాలు చెప్పాల్సిందిగా భూపేంద్ర అనే వ్యక్తి ఆరు నెలలుగా నాయిబ్ తహశీల్దార్ సిద్ధార్థ్ సింఘాల్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎంతకీ తహశీల్దార్ పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన భూపేంద్ర..సింఘాల్‌ను నిలదీశాడు. రూ.25,000 లంచమిస్తేనే తన పని జరుగుతుందని తహశీల్దార్ చెప్పాడు.
అంతడబ్బు కట్టే స్థోమత తనకు లేదని, ఎలాగోలా తన పనిచేసిపెట్టాలని భూపేంద్ర ఆయన్ను వేడుకున్నాడు. లంచానికి బదులుగా బాధితుడి ఇంట్లో ఉన్న గేదెను తహశీల్దార్ తన కారుకు కట్టేసుకుని తీసుకెళ్లాడు. ఈ చర్యతో తీవ్ర దుమారం రేగింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, భూపేంద్ర తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని, తాను గేదెను తీసుకెళ్లలేదని తహశీల్దార్ ఆరోపించాడు. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సింఘాల్‌కు నోటీసులు జారీ చేశారు.