రైతు పింఛను పథకం ప్రారంభించిన మోడీ: నెలకు రూ.3వేలు, 5కోట్ల రైతులకు మేలు
ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతులకు మరో తీపి కబురును అందించారు. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ఆయన రాంచీలో గురువారం ప్రారంభించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే మూడేళ్లకు గానూ రూ. 10,774 కోట్లు కేటాయించింది.
60ఏళ్ల తర్వాత నెలకు రూ. 3వేలు
చిన్న, సన్న కారు రైతులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. 18 నుంచి 40ఏళ్ల మధ్యలో ఉన్న వ్యవసాయదారులు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో పేరు నమోదు చేసుకున్న వారికి 60ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 3వేల పింఛనును కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
ఇది వాలంటరీ స్కీమ్ కావడంతో నచ్చిన రైతులు ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో చేరిన వారు నెలకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రైతుల పేరిట చెల్లిస్తుంది. ఈ రెండు మొత్తాలను 60ఏళ్లు నిండిన తర్వాత రైతులకు నెలకు రూ. 3వేలుగా ఇస్తారు.