• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

యురేనియం – నల్లమల – చీకటికోణం!

Share Button

కేంద్ర ప్రభుత్వం తేనే తుట్టెను కదిలించింది. నల్లమలలో యురేనియం తవ్వకాలకు అన్ని అనుమతులు వచ్చేసాయి. ఇక భారీ వాహనాలు, యంత్రాలు, బుల్‌డోజర్లు దిగాల్సి వుంది.
పక్షుల కిలకిలా రావాలు వినబడాల్సిన చోట యంత్రాల హోరు మార్మోగుతుంది.
పులులు గాండ్రింపులు వినబడే చోట యంత్రాలు గర్జిస్తాయి.
పచ్చని అడవంతా ఒక్కసారిగా పారిశ్రామిక వాడగా మారుతుంది.
ప్రజలు నిలువునా దుమ్మైపోతారు. పచ్చని అడవి తెల్లగా మారిపోతుంది.
ఊహకందని భీకర దృశ్యాలు కనబడుతాయి.
టైగర్‌ ప్రాజెక్టు యురేనియం ప్రాజెక్టుగా మారుతుంది.
కృష్ణానది కలుషితమవుతుంది.
హైదరాబాదు వాసులకు మంచినీరు బదులు విషపునీరు సరఫరా అవుతుంది.
తెలంగాణలో నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలు దెబ్బతింటాయి.

తెలంగాణ ప్రాంత నల్లమల అడవిలోని రాతి పొరల్లో అట్టడుగు భాగాన యురేనియం నిక్షేపాలు దాగివున్నట్లు కనుగొన్న వెంటనే యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ తవ్వకాలకు సన్నద్ధమయ్యింది. గతంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుట్టు చప్పుడు కాకుండా యురేనియం ఖనిజాల కోసం రహస్య సర్వేలు నిర్వహించారు.
డిబీర్స్‌ కంపెనీ వారు ఇప్పటికే 430 బోర్లు వేశారు. ఇంకా 4000 పై చిలుకు బోర్లు వేయడానికి సిద్దపడుతున్నారు. ప్రజలకు అనుమానం వచ్చి బోర్ల వాహనాలను ధ్వంసం చేస్తే అప్పుడు అసలు విషయం బయట పడింది.
ఇప్పటి వరకు ఇక్కడ 20 వేల టన్నుల యురేనియం 83 చ.కి.మీ. పరిధిలో విస్తరించినట్లు అంచనా వేశారు. కానీ, అది అంత వరకే పరిమితం కాదు. ఇంకా విస్తరిస్తుంది.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా తిప్పి కొట్టి నిక్షేపాలను వెలికి తీస్తామనే ధీమాతో ప్రభుత్వం ఉంది. యురేనియం తవ్వకాలు ప్రజల ప్రయోజనాల కోసమని కేంద్ర ప్రభుత్వం నమ్మబలుకుతుంది.
2030 నాటికి 40 వేల మెగావాట్ల అణువిద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అణు విద్యుత్‌ రియాక్టర్లకు ముడిసరుకు అయిన యురేనియం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని కేంద్రం పైకి చెబుతోంది. దాని అసలు గుట్టు వేరే ఉంది.
***

యురేనియం త్రవ్వకాలు కేవలం కరెంటు ఉత్పత్తి కోసం మాత్రమె జరగడం లేదు. దాని ముసుగులో ఇంకా యేవో జరుగుతున్నాయి. పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు, ఆధిపత్య భావజాలం ఉన్న కొందరు పెద్దమనుషులు, ప్రభుత్వం కలిసి చేస్తున్న ఒక పెద్ద కుట్ర దీనిలో దాగుంది అనిపిస్తుందని చాలామంది భావిస్తారు. యురేనియం త్రవ్వకాల వెనుక ఉన్న చీకటి కోణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!
***
దేశంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ తవ్వకాల బాధ్యతలు యురేనియం కార్పోరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ నిర్వర్తిస్తుంది. త్రవ్వకాలు, భూ సేకరణ, భూములు తీసుకున్న ప్రజలకు పునరావాసం, నష్ట పరిహారం, కాలుష్య నియంత్రణ వంటి అంశాలు ఇది చూసుకుంటుంది.

అటామిక్ ఎనర్జీ ద్వారా కరెంట్ ని జనరేట్ చేసేందుకు నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపడుతున్నట్లు Department of Automic Energy చెబుతోంది. కానీ వాస్తవాలు లోతుగా గమనిస్తే పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. నిజంగా అటామిక్ ఎనర్జీ ప్రపంచంలో కరెంటు తయారీకి ప్రత్యామ్నాయ మార్గమా? అవునో కాదో కొన్ని ఫ్యాక్ట్స్ గమనిస్తే మనకు అర్థం అవుతుంది.
1. ప్రస్తుతం మన దేశంలో అటామిక్ ఎనర్జీ సామర్థ్యం 2 శాతం కూడా లేదు.
2. ఇక ప్రపంచవ్యాప్తంగా అణువిద్యుత్‌ వాటా తగ్గుతున్నట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ 2018 లో ఒక నివేదిక ద్వారా వెల్లడించింది.
3. ప్రస్తుతం ప్రపంచంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న విధ్యుత్ లో అణు విద్యుత్‌ వాటా 11శాతం లోపే ఉంది. 2050 నాటికది 5.6 శాతానికి పడిపోనుందని అంచనా వేస్తున్నారు.
4. 2011 లో జపాన్ లోని ఫుకుషిమా అను రియాక్టర్ సునామీ దెబ్బకి ధ్వంసం అవగా భయంకరమైన ప్రాణ మరియు ఆస్తినష్టం జరిగింది. అప్పటినుంచి జపాన్, రష్యా, ప్రాన్స్ వంటి దేశాలు న్యూక్లియర్ రియాక్టర్లను పూర్తిగా మూసేసాయి.

5. అణు విద్యుత్‌ ఉత్పత్తి ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడలో ప్రతిపాదించిన అణువిద్యుత్‌ కర్మాగారంలో ఉత్పత్తి చేసే యూనిట్‌ ధర రూ.20 నుంచి రూ.32 వరకు ఉంటుందని ఒక అంచనా. అయితే సోలార్ ఎనర్జీ ద్వారా కేవలం ౩ నుంచి 5 రూపాయలలోపే ఒక యూనిట్ కరెంటును ఉత్పత్తి చేయొచ్చు.

అంతే కాకుండా యురేనియం త్రవ్వకాల వలన జరిగే నష్టాలు ఇప్పుడు చూద్దాం!
1. భూమిలో ఉన్నంత వరకు యురేనియం క్షేమకరమైనది. భూమిలో నుంచి బయటకు రాగానే అది మొదట గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి ఆక్సైడ్‌గా విడిపోయి గాలిలో కలిసిపోతుంది. బయటికి రాగానే దీనికి అణుధార్మికత వస్తుంది.
2. దీనికి అణుభారం ఎక్కువ. దీని సాంద్రత సీసం కంటే 75 శాతం అధికంగా ఉంటుంది. ఇది న్యూక్లియర్‌ రియాక్టర్లలో చర్య జరిగినపుడు అత్యధిక ఉష్ణోగ్రతలను విడుదల చేస్తుంది.
3. అణ్వాయుధాలలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఇంధనం యు-235 తక్కువ లో తక్కువగా 7కిలోల యురేనియంతో ఒక అణుబాంబును తయారు చేయొచ్చు.
4. యూరేనియం (యు- 238) నుంచి జనించే ఫ్లుటోనియం అనే రూపం (యు-239) అత్యంత ప్రమాదకరమైనది. యురేనియం తన ప్రతి రసాయనిక చర్యలో అత్యంత ప్రమాదకరమైన బీటా, గామా కిరణాలను వెదజల్లుతుంది. దీనిలోని అణుధార్మికత గాలిలో ప్రవేశించిన తర్వాత మనుషుల శరీరాల్లో, జంతువుల శరీరాల్లోకి ప్రవేశించి ఎముకల్లో స్థిరపడుతుంది.
5. దీనితో చాలా సులభంగా క్యాన్సర్‌ వ్యాధి వ్యాపిస్తుంది. భూమి లో నుంచి యురేనియంను బయటకు తీయడమే ఆలస్యం గాలితో చర్య జరిపి విషంగా మారుతుంది.
6. యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతం నుంచి దాదాపు కొన్ని వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం నుంచి వెలువడిన రేడియో ధార్మిక పదార్థాలు వేల సంవత్సరాలు వాతావరణంలోనే ఉండిపోతాయి. తద్వారా గాలి, నీరు కలుషితమై మనుషులు, జంతువులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ తో చనిపోతారు.
7. కొన్ని వందల తరాలు వికృత సంతానం లేదా పూర్తిగా సంతాన లేమితో మానసిక వ్యధకు గురియ్యే ప్రమాదం ఉంది.
8. పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి స్త్రీలలో అండాల విడుదల క్రమం దెబ్బతినడం, గర్భాశయ క్యాన్సర్‌ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

పర్యావరణం పై ప్రభావం
1.
యూఎస్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ నివేదిక ప్రకారం యురేనియం గాలిని, నీటిని, మట్టిని, ఆహారాన్ని తొందరగా కలుషితం చేస్తుంది.
2. గాలిలో దుమ్ములాగా ప్రయాణించి నీటిని చేరుతుంది. తద్వారా మొక్కలు గ్రహిస్తాయి. వానలు పడినపుడు ఈ అణుధార్మికత దుమ్ము భూమిలోకి చేరుతుంది.
3. యురేనియం కోసం బోర్లు తవ్వే ప్రాంతాలలో తాగే నీటిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భూ ఉపరితల నీటిలో ఇది చాలా దూరం ప్రయాణిస్తుంది. యురేనియం ఆనవాళ్లు మట్టిలో కలిసి ఉంటాయి. అందువల్ల మొక్కలు, చెట్ల వేర్లలో నిక్షిప్తమౌతాయి.
4. యురేనియం తవ్వకాల కోసం 1000 ఫీట్ల వరకు బావులు తవ్వడం వల్ల 200-300 ఫీట్ల లోతులో ఉండే నీటి వనరులు కిందికి దిగుతాయి. తద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి కొరత ఏర్పడుతుంది.
5. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే నదుల, నీటి సెలయేర్ల యందు, అణుధార్మిక పదార్థాలు కలవడం వల్ల రానురాను నీటి వనరుల మొత్తం విషపదార్థాలుగా మారి జలరాశులు మొత్తం అంతరిస్తాయి.
6. మండుతున్న యురేనియంతో కార్బన్‌ను చర్య జరపడం వలన యురేనియం మోనాక్సైడ్‌ ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది. అందువల్ల వాతావరణంలోని ఓజోన్‌ పొర దెబ్బతిని, భూవాతావరణం వేడెక్కి ఋతువుల్లో విపరీత పరిణామాలు సంభవిస్తాయి. మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. జీవ వైవిద్యం దెబ్బతింటుంది.

జీవజాలంపై యురేనియం ప్రభావం
1. 1987 సంవత్సరంలో ది నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఆక్యూపేషనల్‌ సొసైటీ అండ్‌ హెల్త్‌ గుర్తించిన విషయాల ప్రకారం యురేనియం అనేది భయంకరమైన అణుధార్మిక పదార్థం.
2. ఇందులోని రేడాన్‌ వాయువులు యురేనియం తవ్వకాల గనులలో పని చేస్తున్న కార్మికుల శరీరాల్లోకి వెళ్లి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కు దారి తీసిందని గుర్తించారు.
3. యురేనియం తవ్వకాల్లో శుద్ధి కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికులు కేవలం ఒక రేడాన్‌ ధార్మికత నుంచే కాకుండా రసాయనిక చర్య జరుగుతున్న క్రమంలో విడుదలయ్యే అల్ఫా, బీటా, గామా కిరణాల నుంచి చాలా ప్రమాదాన్ని ఎదుర్కొన్నారని గుర్తించారు.
4. అణు విద్యుత్‌ ప్లాంటు, అణు శుద్ధి కర్మాగారాల్లో జరుగుతున్న ప్రమాదాలన్ని కేవలం మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నది. భూ కంపాలు, సునామి, వరదల వల్ల సంభవించిన ప్రమాదాలు చాలా తక్కువ.
5. కావున ఇవి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు.
6. మనం రోజు తీసుకునే ఆహారంలో, నీటిలోను యురేనియం పాళ్లు 0.9 మైక్రో గ్రాములుగా ఉండడం ప్రమాదం కాదని తెలియజేస్తున్నారు.
7. యురేనియం భూమి నుంచి లభించే అన్ని గనులలో ప్రధాన ఖనిజంగా ఉంటుంది. దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కానీ యురేనియం గనుల తవ్వకాల, గాలి, నీటి, ఆహారం ద్వారా చర్మం నుంచి శరీరంలోకి వ్రవేశిస్తుంది. తద్వారా ఒక మానవ జాతికే కాకుండా మొత్తం జీవజాతి పరిణామంపై ప్రభావం చూపుతుంది. తల్లి జీవి ద్వారా ఈ విషపూరితాలు అంగవైకల్యం సంభవించి వికృత జీవులుగా జన్మిస్తారు.
8. యురేనియం శుద్ధి కోసం అధిక మొత్తంలో నీటి వనరులు అవసరమవుతాయి. శుద్ధి కోసం వాడిన నీరు తిరిగి మంచి నీటి ప్రవాహాల్లో కలవడం వల్ల ఈ నీటిని తాగే జంతువులు మరణిస్తాయి.
9. 2009 లో నల్లగొండ జిల్లాలోని పెద్దగట్టు ప్రాంతంలో గొర్రెలు, మేకలు యురేనియం తీసిన గుంతల్లోని నీటిని తాగి మృత్యువాత పడ్డాయి.
10. కడప జిల్లా పులివెందులలోని తుమ్మల పల్లి మైనింగ్‌ ప్రాంతంతో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాలు 100 కిలోమీటర్ల వరకు అణుధార్మికత ప్రభావం వల్ల పిల్లలు క్యాన్సర్‌ వ్యాధులతో పుడుతున్నారు.
11. జార్ఖండ్‌ లోని బిదుగూడలో యురేనియం తవ్వకాల వలన నీరు మొత్తం కలుషితం అయి ఆదివాసీ సమాజం అంతరించిపోతున్నది.
12. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆయా ప్రాంతాలలోని మూల వాసులు యురేనియం తవ్వకాలు, శుద్ధి కర్మాగారాలు, విద్యుత్‌ ప్లాంట్ల వల్ల వేల సంవత్సరాల పాటు చేయని తప్పుకు బలయ్యే అవకాశం ఉన్నది.

విద్యుత్ ఉత్పత్తికి ప్రమాద రహిత ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయి . థర్మల్‌, జల విధ్యుత్ , సౌర విద్యుత్‌ వంటివి విస్తారంగా ఉన్నాయి. వాటిని విస్మరించి అడవులను ధ్వంసం చేసి, ఆదిమ తెగలను, చెంచులను నిర్వాసితులను చేసి, నదులను విషమయం చేసి, పరిసర ప్రాంత ప్రజల బతుకులను పణంగా పెట్టే అణువిద్యుత్తుపై దృష్టి సారించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలకు సరైన సమాధానం లభించదు.

ప్రపంచవ్యాప్తంగా యురేనియం తవ్వకాలు చేపట్టిన ప్రతిచోటా ఆ ప్రాంత ప్రజలకు విషాదమే మిగిలింది. కూడంకులం నుంచి కొవ్వాడ దాకా తుమ్మలపల్లె నుంచి నల్లమల దాకా అడుగడుగునా ప్రజా వ్యతిరేకత, అణచివేత మాత్రమే ఉంది. స్వచ్చందంగా స్తాపించిన అణువిధ్యుత్ కేంద్రాలు చాలా తక్కువ.
****
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా తుమ్మలపల్లి ప్రాంతంలో యురేనియం త్రవ్వకాల వలన ఆ ప్రాంత రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రీసెంట్గా డా. వేంపల్లి గంగాదార్ అనే ప్రముఖ రచయత అక్కడి పరిస్థితులకు అద్దంపట్టేలా “యురేనియం పల్లె” అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది.
1. రైతుల నుంచి తీసుకున్న భూములకు ఇప్పటికీ సరైన నష్టపరిహారాన్ని ఇవ్వలేదు.
2. గతంలో 200 అడుగుల లోతులో ఉన్న గ్రౌండ్ వాటర్ యురేనియం త్రవ్వకాల తర్వాత వచ్చాక 1000 నుంచి 1500 అడుగుల్లోకి వెళ్లిపోయింది.
3. మైనింగ్ ప్రాంతంలోని వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఇందువల్ల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. కలుషిత జలాలు సేవించడం వల్ల పశువులు చనిపోతున్నాయి, ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
4. కాలుష్యం కారణంగా యురేనియం త్రవ్వకాల చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలియని కొత్త కొత్త జబ్బులు ప్రజను పట్టి పీడిస్తున్నాయి.
5. మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చిన విధంగా 360 హెక్టార్లలో యూసీఐఎల్‌ మొక్కలు నాటాల్సి ఉన్నా ఆ పని ఇప్పటికీ చేయలేదు.

దీన్ని బట్టి అర్థ అయ్యేది ఏంటంటే, యురేనియం త్రవ్వకాలు కేవలం కరెంటు ఉత్పత్తి కోసం మాత్రమె జరగడం లేదు. దాని ముసుగులో ఇంకొకటి ఏదో జరుగుతోంది. పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు, ఆధిపత్య భావజాలం ఉన్న కొందరు పెద్దమనుషులు, ప్రభుత్వం కలిసి చేస్తున్న ఒక పెద్ద కుట్ర దీనిలో దాగుంది.

****

యురేనియం భూమిలో, నీటిలో సహజ సిద్ధంగా లభించే రేడియో ఆక్టివ్ రసాయన మూలకం. ఇది మూడు ఐసోటోపుల మిశ్రమం. దీనిని అణ్వాయుధాలలో, న్యూక్లియర్ రియాక్టర్లలో ఇంధనంగా వాడుతారు.
ప్రకృతిలో యురేనియం ప్రధానంగా మూడు రూపాలలో లభిస్తుంది. అవి U238, U235, U234.

U235 అనేది అణురియాక్టర్లు అణ్వాయుధాల్లో వాడే అతి ముఖ్యమైన ఇంధనం. భారత్‌లో ప్రధానంగా మేఘాలయ, అస్సాం, నాగాలాండ్‌, బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలో ఉన్నాయి.

విద్యుత్ తయారీకి ఇతర మార్గాలు ఉన్నప్పటికీ మన ప్రభుత్వం యురేనియం వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం “అణు బాంబుల తయారీ”. అవును. పక్కనే ఉన్న పాకిస్తాన్, చైనా లను బూచిగా చూపి అణుబాంబులు మరిన్ని తయారుచేసుకోవాలని భావిస్తోంది.

కరుడుగట్టిన సామ్రాజ్యవాద భావాలున్న కొందరు పెద్దలు, అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలు అందరూ కలిసి ఈ పనికి ఒడగట్టారు.

సాధారంగా అణుబాంబు తయారుచేయడానికి ప్లుటోనియం అవసరం అవుతుంది.

అణుబాంబు చేసేది ప్లుటోనియంతో కదా ఇప్పుడు త్రవ్వకాలు జరిపేది యురేనియం కోసం కదా. అలాంటప్పుడు సమస్య ఏంటి? అనే డౌట్ వచ్చిందా? అక్కడికే వస్తున్నా….
అణుబాంబు కు అవసరం అయ్యే ఈ ప్లుటోనియం సహజసిద్ధంగా దొరకదు. యురేనియం ఉపయోగించి అటామిక్ ఎనర్జీ ద్వారా న్యూక్లియర్ రియాక్టర్ లలో విద్యుత్ ఉత్పత్తి చేసినప్పుడు ప్లుటోనియం విడుదల అవుతుంది. రియాక్టర్ లో ఉపయోగించిన యురేనియం కన్నా ఎక్కువ మొత్తంలో ఈ ప్లుటోనియం ఉత్పత్తి జరగడం ఇక్కడ శ్చర్యమైన విషయం.

వెయ్యి మెగావాట్ల సామర్థ్యమున్న అణు విద్యుత్తు రియాక్టరు 10 నుంచి 15 అణుబాంబుల తయారుకు సరిపడే ప్లుటోనియం ఉత్పత్తి చేస్తుంది.

ఇక్కడ కరెంటు ఉత్పత్తి అనేది పైకి కనిపిస్తున్న ముసుగు మాత్రమే. అసలు గుట్టంతా అణుబాంబు తయారీకి సరిపడా ముడి సరుకు తయారు చేసుకోవడమే.
ఇక్కడ యురేనియం మైనింగ్ చేసే కంపెనీల నుంచి, అను రియాక్టర్ లు స్తాపించే కంపెనీలు అన్నీ విదేశీ కంపెనీలే. వాళ్ళకు వాళ్ళ లాభాలు తప్ప ఇంకేవీ పట్టవు. డి బీర్స్ అనే కంపెనీ వజ్రాలు మైనింగ్ చేసి అన్వేషించే బ్రీటీష్ కంపెనీ. ఇప్పుడు నల్లమలలో యురేనియం త్రవ్వకాలు జరపడం లేదని కేవలం వజ్రాలు అన్వేసిస్తున్నారని ఈ కంపెనీ కి కాంట్రాక్టు ఇచ్చి దాని ముసుగులో యురేనియం త్రవ్వకాలు చేస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఏదన్నా ఉందా??

దేశాన్ని బాహ్య శత్రువులనుంచి రక్షించుకోవాలి. అది ప్రభుత్వ ధర్మం. కానీ ఎంత మూల్యానికి? పైకి ఒకటి చేభుతూ లోపల ఒకటి చేస్తూ, మన దేశ ప్రకృతి సంపదను, ఆదివాసీల ప్రాణాలను పణంగా పెట్టి ఇలా దొడ్డిదారిన అన్వస్త్రాలు సమకోర్చుకోవడాన్ని ఏమంటారు??

ఇక్కడ బహుళ జాతి కంపెనీల దోపిడీ, మన దేశ సామ్రాజ్య వాద కాంక్ష తప్పా ఇంకేం లేదు. మోసపోయేది ఆదివాసీలు, సామాన్య ప్రజలు, నోరులేని జంతుజీవాలు, పచ్చని చెట్లు మాత్రమే! ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఆఫ్ట్రాల్….

***
ఈ అణ్వస్త్ర విధ్వంసాలు ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

• రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1945 ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమా పట్టణంపై అమెరికా యురేనియం బాంబు వేయడం వలన 80 వేల మంది చనిపోయారు. మళ్ళీ మూడు రోజుల తర్వాత నాగసాకి పట్టణంపై ఫ్లుటోనియం బాంబును వేయడంతో 75 వేల మంది చనిపోయారు. దాడి నుంచి బతికి బయటపడ్డ వారు ఆ తరువాత అనేక రోగాల బారిన పడి చనిపోయారు.
• 1986 ఏప్రిల్‌ 26న రష్యాలోని చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ రియాక్టర్‌ పేలిపోయినపుడు వెంటనే 4 వేల మంది చనిపోయారు. 2 లక్షల 46 వేల చ.కి.మీ. ప్రాంతంలో అణుధార్మిక మూలకాలు విడుదలయ్యాయి. ఒక అంచనా ప్రకారం చెర్నోబిల్‌ అణు ప్రమాదంలో మొత్తం 9 లక్షల మంది చనిపోయారు.
• 2011 మార్చిలో జపాన్‌లోని ఫుకుషిమాలో పేలిపోయిన అణు విద్యుత్‌ రియాక్టర్లు సృష్టించిన భీభత్సం 80 కి.మీ. పరిధికి వ్యాపించింది.
• మానవ నిర్మిత అణురియాక్టర్లు మానవ తప్పిదాల వల్లనే ప్రమాదపుటంచులకు చేరుకుంటున్నాయి.
• 1952లో కెనడాలోని ఒంటారియోలో, 1979లో అమెరికాలో సంభవించిన త్రీమైల్‌ ఐలాండ్‌ ప్రమాదాలు అణు రియాక్టర్ల వల్ల ప్రమాదాలు తప్పవని సూచిస్తున్నాయి.

• ఒక అధ్యయనం ప్రకారం అణు విద్యుత్‌ రియాక్టర్ల వలన ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 10 వేల మెట్రిక్‌ టన్నుల అణు వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 15 శాతం మాత్రమే శుభ్రపరుస్తున్నారు. దీన్ని ఎక్కడ దాచాలో దిక్కు తోచని స్థితి. ఇది ప్రమాద రహితం కావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. మిగిలిన 85 శాతాన్ని శుభ్రపరచకుండా వదిలేసిందే. ఇది ప్రమాద రహితం కావడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఈ వ్యర్థాలను పూడ్చడానికి ముఖ్యంగా మన దేశంలో స్థలమెక్కడిది? పూడ్చిన ప్రాంతాలు సంవత్సరాల తరబడి పనికిరాకుండా పోతాయి. ప్రమాద రహితం చేయడం, పూడ్చే మానవ రహిత ప్రాంతాన్ని వెతుక్కోవడం ఏ దేశానికైనా తలకు మించిన భారం.
• ఒక్క అణు రియాక్టరు వెయ్యి మెగావాట్ల విద్యుత్తుకు 30 టన్నుల అణు వ్యర్ధాలను విడుదల చేస్తుంది. అణ్వాయుధాలు ప్రయోగించినపుడు జీవరాసులకు హానికరమైన స్ట్రాన్షియం, యురేనియం, సీసియం లాంటి అణుధార్మిక మూలకాలు విడుదలవుతాయి. వీటివల్ల కాన్సర్‌, చర్మ వ్యాధుల్లాంటి అనేక రోగాలు సంభవిస్తాయి. ఇవే ప్రమాదకర మూలకాలు విద్యుత్‌ ఉత్పత్తి క్రమంలో కూడా వెలువడుతాయి. ఇంత వినాశనానికి దారి తీసే అణు విద్యుత్‌ ఉత్పత్తి మనకు అవసరమా!

• అణు రియాక్టర్ల ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక్క యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి గాను 60 గ్రామాల కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతుంది. తత్ఫలితంగా భూమండలం వేడెక్కుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ వలన ప్రమాదకర మార్పులు ఏర్పడి జీవరాసుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది.
• అణు విద్యుత్‌ ప్రక్రియ ప్రమాదం అని గ్రహించాక పలు దేశాలు ఉత్పత్తిని నిలిపి వేశాయి. కాని ఏ ఒక్క దేశం కూడా అణు రియాక్టర్లను పూర్తిగా నిషేధిస్తామని ప్రకటించలేదు.
• మన దేశంలో 22 అణు విద్యుత్‌ రియాక్టర్లు వున్నాయి. వీటిన్నిటికి అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ దృష్టిలో పడకుండా యురేనియంను సరఫరా చేస్తుంది.
• జార్ఖండ్‌ రాష్ట్రంలోని జాదుగూడ కేంద్రం నుంచి వెలికి తీసిన యురేనియంను ప్రధానంగా సప్లై చేస్తుంది. దాని చుట్టూ నివసిస్తున్న 50 వేల మంది ప్రజలు క్యాన్సర్‌ ఇతర రోగాల బారిన పడి చిక్కిశల్యమవుతున్నారు. ముఖ్యంగా మహిళలు గర్భస్రావాలకు గురౌతున్నారు.
ఇంత వినాశనానికి ఒడిగట్టి ఉత్పిత్తి చేసే అణు విద్యుచ్ఛక్తి మొత్తం ఉత్పత్తిలో ఇప్పటి వరకు 3 శాతం కూడా లేదు. ఉత్పత్తి ఖర్చు గణనీయంగా పెరిగింది.
యురేనియం తవ్వకాల పేరుతో, అణు విద్యుత్‌ రియాక్టర్ల నిర్మాణం పేరుతో సామ్రాజ్యవాద బహుళ జాతి సంస్థలు చొరబడుతున్నాయి. అమెరికా, ప్రాన్స్‌, అర్జెంటీనా ఇప్పటికే తిష్టవేశాయి. నల్లమలకు డిబీర్స్‌ వచ్చేసింది. యురేనియం తవ్వకాలు కొనసాగితే నల్లమల నామరూపాలు లేకుండా పోతుంది. అడవి, చెట్లు, జీవరాసులు, కృష్ణానది చరిత్రపుటల్లో కలిసి పోతాయి. ఈ విధ్వంసకర అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడాలి. మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక వేత్తలు, పర్యావరణ వేత్తలు, యువకులు, మహిళలు, నల్లమలను కాపాడడానికి ఆదివాసీలు చేసే పోరాటానికి అండగా నిలవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat