యురేనియం తవ్వకాలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి ధ్వజం
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.నల్లమలలో యురేనియం తవ్వకాలకు వచ్చే వారి గుండెల్లో గునపం దింపుతామని హెచ్చరించారు. అమ్రాబాద్ మండలంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ రెడ్డి యురేనియం కారణంగా ఈ ప్రాంతమంతా కలుషితం అవుతుందని, అదే జరిగితే ఇక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్లాలని వ్యాఖ్యానించారు.తాను కూడా నల్లమల్ల బిడ్డనేనని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి యురేనియం తవ్వకాలను ఆపలేకపోయారని స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై విరుచుకుపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి సహకరిస్తున్నారని ఆరోపించారు.
యురేనియం తవ్వకాలకు సహకరిస్తున్న టిఆర్ఎస్, బిజెపిలను నల్లమలలో సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు.కవులు, కళాకారులు, యువత, విద్యార్థులు, మేధావులు, నల్లమలలో పుట్టిన ప్రతి బిడ్డ ఐక్యతను ప్రదర్శించాల్సిన సమయం ఇది అని, యురేనియం తవ్వకాలు జరపబోమని కేసీఆర్ హామీ ఇచ్చే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.ఇక్కడి ప్రజల పోరాటానికి తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని స్పష్టం చేశారు.
అంతకుముందు ఆయన అమ్రాబాద్ మండలం మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు, అనంతరం అమ్రాబాద్ లోని అంబెడ్కర్ చౌరస్తావద్ద ప్రసంగించారు.
ఈ మీటింగ్ లో మాజీ ఎంఎల్ఏ వంశీకృష్ణ, జడ్పీటీసీ చైర్మన్ అనురాధ, ఎంపీపీ శ్రీనివాస్, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.