యురేనియం తవ్వకాలపై కెటిఆర్ ట్వీట్
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరి ఆందోళనను తాను చూస్తున్నానని ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి.. ఆయనతో వ్యక్తిగతంగా చర్చిస్తానని ట్వీట్‌లో హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా యురేనియం తవ్వకాలపై టాలీవుడ్‌లోనూ తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దర్శకుడు శేఖర్ కమ్ముల సేవ్ నల్లమల అంటూ సపోర్ట్ తెలియజేసారు. ఆ తరువాత పవన్ కల్యాణ్, విజయ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, అనసూయ, సమంత, రామ్ సైతం సేవ్ నల్లమల ఉద్యమానికి మద్దతు తెలిపారు. యురేనియం తవ్వకాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా.. అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యురేనియం సర్వే గురించి తెలియగానే రంగంలోకి దిగిన మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విపక్ష నేతలు.. యువజన, కుల సంఘాల నాయకులతో కలిసి సేవ్ నల్లమల ఉద్యమాన్ని చేపట్టారు.