మళ్లీ పేలిన పెట్రో బాంబు పెరుగుదల ఇప్పట్లో ఆగదట
ఆ సౌదీ అరేబియాలో చమురు ఉత్పాదక కేంద్రాలపై దాడులు సంగతేమో గానీ.. దాని దుష్ప్రభావం భారతీయ మార్కెట్ పై తీవ్రంగా పడింది. వాహనదారుల జేబులు ఖాళీ చేసి పడేస్తోంది. సౌదీ అరేబియాలో దాడుల తరువాత ఎకాఎకిన పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పటికే వాహనదారుల వీపును విమానం మోత మోగిస్తున్నాయి. తాజాగా- మరోసారి పెట్రోలు, డీజిల్ ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. పెట్రో ఉత్పత్తుల రేట్లను సవరించినట్లు ఆదివారం చమురు సంస్థలు వెల్లడించాయి.
దీని ప్రకారం.. పెట్రోలు లీటర్ ఒక్కింటికి రూ.1.59 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి రూ.1.31 పైసలు పెరిగాయి. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. దేశంలో 2017 నుంచి పెట్రోలు, డీజిల్ రేట్లలో రోజువారీ మార్పుల వ్యవస్థను ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచీ వరుసగా ఏడో రోజు వాటి ధరలు పెరగడం.. ఇదే మొదటిసారి. ఈ పరిస్థితుల్లో వాహనాలను బయటికి తీయాలంటే బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ పెరుగుదల ఇక్కడితో ఆగేలా లేదు.