పాకిస్థాన్‌లోనూ హీరోగా మారిన అభినందన్..
భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శత్రువుల చేతికి చిక్కి కూడా ధైర్యం సడలని భారత సైనికుడిగా మన దేశ ప్రజల గుండెల్లోనే కాకుండా అటు పాకిస్థానీయుల గుండెల్లో కూడా చోటు సంపాదించుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన ఓ చాయ్ వ్యాపారి అభినందన్ చాయ్ తాగుతున్న ఫోటోతో బ్యానర్‌ను ఏర్పాటు చేశాడు. ఇటీవల పాక్ కస్టడీలో ఉన్న సమయంలో అభినందన్ చాయ్ తాగిన ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ బ్యానర్‌పై ఇది ఎలాంటి చాయ్ అంటే.. శత్రువును కూడా మిత్రునిగా మార్చేది అని రాయించాడు చాయ్ వ్యాపారి. బ్యానర్‌లో అభినందన్ ఫోటో చూస్తుంటే.. ప్రశాంతంగా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉన్నాడు. అభినందన్ వర్ధమాన్ ఫోటో ఉన్న బ్యానర్‌ను ఓ పాకిస్థానీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో టీ వ్యాపారిపై ట్విట్టర్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐడియా ఈజ్ ఫన్‌టాస్టిక్ అని ఒకరు ట్వీట్ చేయగా, పలువురిని ఇది ఆకట్టుకుంటుందని మరొకరు ట్వీట్ చేశారు.