నీళ్ల నిలువను, విలువను తెలిపే థీమ్‌పార్క్
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్‌నం.51లో జలమండలి ఆధ్వర్యంలో రూ.3 కోట్ల వ్యయంతో ఈ థీమ్‌పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వర్షపునీటిని ఒడిసిపట్టడానికి వీలుగా 42 రకాల వినూత్న విధానాలపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది అక్టోబరులో ఈ పార్క్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు పదివేలమందికి పైగా సందర్శించారు. భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ఇల్లు, కార్యాలయం, పాఠశాల, అపార్టుమెంటు ఇలా ఎక్కడైనా నేలపై కురిసే ప్రతీ వర్షపునీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భంలోకి చేర్చేందుకు వీలుగా విభిన్నరకాల ఇంకుడు గుంతల వెరైటీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీ ఆసక్తి.. చేసే వ్యయం ఆధారంగా ఒక మోడల్‌ను ఎన్నుకొని మీ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను ఈ థీమ్‌పార్క్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. అంతేనా.. అడవుల ప్రాముఖ్యాన్ని వివరించే ‘మాట్లాడే చెట్టు’.. వర్షపు నీటి సంరక్షణపై వీడియో గేమ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి.. పార్కు వేళలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకూ.. ప్రవేశం ఉచితం.. ఎక్కువ మంది బృందంగా వెళ్లాలనుకుంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి. జలమండలి అధికారిక వెబ్‌సైట్
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.హైదరాబాద్‌వాటర్.జీఓవీ.ఐఎన్‌ను సంప్రదించి అందులో థీమ్‌పార్క్ రిజిస్ట్రేషన్ యువర్‌స్లాట్ అన్న లింక్‌కు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలి లేదా జలమండలి ప్రత్యేకాధికారి సత్యనారాయణను 9989985102 నంబరులో సంప్రదించవచ్చు. మరింకేంటి ఆలస్యం.. నీటి బొట్టును నేల తల్లికి అందించే ఈ మహాయజ్ఞంలో మనమూ భాగస్వాములమవుదాం. చల్ చలోచలో..