తెలంగాణ గవర్నర్ గా నియమితులైన తమిళ సై సౌందర రాజన్
దేశ సేవకు మరింత అంకితమవుతానని తెలంగాణ గవర్నర్ గా నియమితులైన తమిళ సై సౌందర రాజన్ పేర్కొన్నారు. తనను తెలంగాణ గవర్నర్ గా నియమించిన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. బిజెపిలో క్రమశిక్షణ గల కార్యకర్తగా మెలిగి, పార్టీ పటిష్టతకు కృషి చేసిన కారణంగానే తనకు ఈ పదవి దక్కిందని ఆమె పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో సహకరించిన ప్రతిఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. దేశ సేవ చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆమె తెలిపారు. తెలంగాణకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ఆ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.