టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే సబిత
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో మాజీ మంత్రి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి భేటీఅయ్యారు. ప్రగతిభవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్‌తో భేటీకి కుమారులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, కల్యాణ్‌రెడ్డితో హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా అభివృద్ధిపై చర్చించినట్టు సమాచారం. కొంతకాలంగా ఆమె టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, టీఆర్‌ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న ఆదరణ నేపథ్యంలో గులాబీ పార్టీలో చేరాలని నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు సబితాఇంద్రారెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చారు. సబితాఇంద్రారెడ్డి సైతం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చించాలని భావించారు.
పార్టీలో చేరే విషయంపైనా స్పష్టత ఇవ్వాలనుకున్నారు. అందులో భాగంగానే బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిసినట్టు సమాచారం. వీలైనంత త్వరలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు సీఎం కేసీఆర్‌తోనే ఆమె చెప్పినట్టు తెలిసింది. ముఖ్యమంత్రితో భేటీ తర్వాత మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని టీఆర్‌ఎస్ గెలుచుకోవడానికి కృషిచేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిశామని కార్తీక్‌రెడ్డి తెలిపారు. త్వరలో చేవెళ్లలో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి టీఆర్‌ఎస్‌లో చేరుతామని ఆయన వెల్లడించారు.