చెరువుల ఆక్రమణ పై మత్స్యకారుల ఆందోళన
కుంటలు, చెరువుల ఆక్రమణలపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తూ అచ్చంపేట మునిసిపాలిటి ముందు ధర్నా చేశారు.
చెరువులో జరుగుతున్న అక్రమ కట్టడాలను ఆపివేయాలని,అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆందోళన నిర్వహించారు.
మున్సిపాలిటీ కమిషనర్ మరియు చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో సమాచార అధికారి ఏ.మనూజ కు తమ ఆందోళన తెలిపి విజ్ఞపన పత్రాన్ని ఇచ్చారు.
ఈ ఆందోళనకు బీజేపీ,సిపిఎం లు తమ మద్దతు తెలిపాయి.
ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ…కొత్తగా ఏర్పడిన నగర పంచాయతితో తమను అభివృద్ధి చేస్తారని 20 కి 20 సీట్లు తెరాస అభ్యర్థులను గెలిపిస్తే కమిషన్ల కక్కుర్తికి ఇష్టా రాజ్యంగా అనుమతులు ఇస్తూ అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.మున్సిపాలిటీ అధికారులు కమిషన్ల మోజులో పడి నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు.
సిపిఎం పార్టీ నాయకుడు మల్లేష్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తమని ఒకపక్క ప్రకటన చేస్తుంటే, అచ్చంపేట పట్టణంలోని కుంటలు,చెరువులు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.కుమ్మరి కుంట పూర్తిగా కనుమరుగై పోయిందని, ఇప్పుడు మల్లంకుంట కూడా కనుమరుగు చేసే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
7 ఎకరాల 20 గుంటలు ఉన్న మల్లంగుంట ప్రస్తుతం రెండు ఎకరాలకి ఎలా పరిమితమైంది అంటూ ఆయన ధ్వజమెత్తారు.
జిల్లా మత్స్యకార అధ్యక్షుడు రేణయ్య మాట్లాడుతూ…చెరువులో నీరు నిల్వ ఉండే ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయని, ఆ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో ముదిరాజ్,తెలుగు కులస్థులు భారీగా తరలివచ్చారు.