గుర్తింపు పత్రాలిస్తేనే కాలేజీలకు ‘ఫీజు’!
పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం కఠినతరం చేస్తోంది.
ఈ పథకం ద్వారా అవకతవకలకు కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టింది. అన్ని సౌకర్యాలతోపాటు విద్యార్థులకు సరైన బోధన అందించే కాలేజీలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనుంది. ఇందులో భాగంగా ప్రతి కాలేజీ సకాలంలో గుర్తింపు పత్రాలు సమర్పిస్తేనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింప జేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,274 ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజనీరింగ్, వృత్తి విద్య, పీజీ కాలేజీలున్నాయి. వాటిలో 6,005 కాలేజీలు ఈ-పాస్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా కాలేజీలు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కాలేజీల గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. కానీ ఇప్పటివరకు 5,504 కాలేజీలే గుర్తింపు పత్రాలను సమర్పించాయి. మరో 770 కాలేజీలు వాటిని సమర్పించాల్సి ఉంది.