కొత్త చలాన్లు కొంచెం లేటు
సెప్టెంబర్ ఒకటి నుంచి అమలులోకి రావాల్సి ఉండిన కొత్త ట్రాఫిక్ పెనాల్టీలపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పునరాలోచనలో పడింది. ఒకేసారి ఏకంగా పది రెట్లకు పెనాల్టీలు పెంచటం సబబు కాదన్న అభిప్రాయంతో సర్కారు సంబంధిత అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ రవాణా శాఖ అధికారులతో ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారు. కొత్త పెనాల్టీల సర్క్యులర్‌ను అధికారులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా అతి భారీ పెనాల్టీల పర్యవసానాలపై వారు చర్చించారు. సమావేశం నుంచే ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణలోని అంశాలకు కొన్ని సవరణలు కోరుతూ కేంద్రానికిప్రతిపాదన పంపాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
మోటారు వాహనాల సవరణ చట్టం అమలుపై రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు ఉత్సాహం చూపిస్తుండగా, ఆర్‌టిఎ మాత్రం ఒక అడుగు వెనక్కి వేసి సాధ్యాసాధ్యాలపై సర్కారుతో సమీక్షలు నిర్వహిస్తోంది. కేంద్రం మోటారు చట్టంలో భారీ జరిమానాలకు శ్రీకారం చుట్టడంతో వాటి అమలు విషయలో కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.