కేంద్రం పై వత్తిడి తెద్దాం
నల్లమలలో యురేనియం వెలికితీతకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని ఎప్పుడైనా తవ్వకాలు జరిపే అవకాశం ఉందని యురేనియం వ్యతిరేక ప్రజా సంఘాల రాష్ట్ర కన్వీనర్ జాన్ వెస్లీ అన్నారు. అమ్రాబాద్ మండల కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.యురేనియం అన్వేషణకు వ్యతిరేకంగా నల్లమలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రజా పోరాటానికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం యురేనియం వెలికితీతకు అనుమతులు ఇవ్వబోమని అసెంబ్లీలో తీర్మానం చేసిందని, దాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.
యురేనియం వెలికితీత అంశం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున ప్రభుత్వం ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు.ఈ సమావేశానికి గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.