కుల వృత్తుల ప్రోత్సహించడం ద్వారానే గ్రామీణ ఆర్థిక అభివృద్ధి సాధ్యం-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో బుధవారం పశుసంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విస్తృతంగా పర్యటించారు.నియోజకవర్గములో యాదవ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. తనవంతుగా భవన నిర్మాణానికి ఆయన ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు.అచ్చంపేట పట్టణంలోని అంగిరేకుల శేఖరయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన లబ్ధిదారులకు పాడిగేదలు, గొర్రెలను పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం సంఘంలోని ప్రతి వ్యక్తికి అందేదాక కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు.కులవృత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆయన తెలియజేశారు.ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రె కానీ, పాడి గేదె కానీ మరణిస్తే ఇన్సూరెన్స్ కింద తిరిగి అందజేస్తామని ఆయన తెలిపారు.1962 నెంబర్ కి కాల్ చేస్తే జీవాల వద్దకే వచ్చి వైద్య సేవలు అందిస్తున్న సంచార వైద్యశాలలు ఏర్పాటు ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వానిదేనని ఆయన తెలియజేశారు.ఈ సంవత్సరం వివిధ నీటి వనరులలో 5కోట్ల చేప పిల్లలు వదులుతున్నామని ఆయన తెలిపారు.మత్స్యకారులు చాపలు విక్రయించడానికి సబ్సిడీపై వాహనాలు అందజేశామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.