కంచే చేను మేస్తే ఎలా?
రెవిన్యూ అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి లేని సర్వేనెంబర్ సృష్టించి మరి భూమిని కట్టబెట్టిన వైనం ఇది.
వంగూర్ మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామంలో మండల రెవిన్యూ అధికారులు లేని సర్వే నెంబర్ ను కొత్తగా సృష్టించి ఒక వ్యక్తికి పట్టా హక్కులు కల్పించారని గ్రామస్తులు తెలిపారు.గ్రామంలో 227 సర్వే నెంబర్లు ఉండగా సర్వే నెంబర్ 228 ను కొత్తగా సృష్టించి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టారని ఆరోపించారు.కొంత భూమిని గ్రామ అవసరాల కోసం ఎవరికీ కేటాయించకుండా ప్రభుత్వ ఆదీనంలో ఉంచారని చెప్పారు.ఆ భూమిలోని 30 గుంటలను కొందరు తమ ఆదీనంలో వుంచుకుని,మిగతా భూమి ఖాళీగా ఉండడంతో ఇటివల గ్రామ పంచాయతీ తీర్మానంతో పేద దళితులకు ఇండ్ల స్థలాలకు కేటాయించారు.అది జీర్ణించుకోలేక కొందరు వ్యక్తులు రెవిన్యూ అధికారులతో కుమ్మకై మొత్తం ప్రభుత్వ భూమినే తమ పేరుమీద మార్పిడి చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు అక్రమ పట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు.లేకపొతే గ్రామస్తులతో కలిసి తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సర్పంచ్ హెచ్చరించారు.