ఇంటర్ ఫలితాలపై సీఎం సీరియస్.
ఇంటర్మీడియట్ ఫలితాల ప్రాసెసింగ్‌లో తలెత్తిన లోపాలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. 9.74 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిఉన్న ఫలితాలను ప్రాసెస్ చేసేప్పుడు ఒకటికి రెండు, మూడుసార్లు చెక్ చేసుకోకుండా ఎలా వెల్లడిస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సామర్థ్యంలేని సాఫ్ట్‌వేర్ సంస్థకు పనులను ఎలా అప్పగించారని మండిపడ్డారని సమాచారం. దీంతోపాటుగా.. ఆయన్ను రీ–వెరిఫికేషన్ కమ్ ఫొటో స్కాన్డ్ కాపీ, రీ–కౌంటింగ్, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. తక్కువ కోట్ చేశారన్న సాకుతో నిబంధనలను కూడా సరిగ్గా అమలు చేయకపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఆ సంస్థ 2017–18 విద్యాసంవత్సరంలో వార్షిక, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రాసెసింగ్‌ను సరిగా చేసి చూపించనపుడు.. ఆ సంస్థతో ఒప్పందం ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించినట్లు తెలిసింది.
అధికారులు చేసే తప్పుల వల్ల ప్రభుత్వం బదనాం అవుతోందని, ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృతం అయితే సహించేది లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఆన్‌లైన్ ప్రవేశాలకు సంబంధించి సమస్యలు తలెత్తినపుడు సదరు సంస్థ ఒప్పందం రద్దు చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, పైగా ఆ సంస్థ ప్రవేశాల ప్రాసెసింగ్ సరిగ్గా చేయలేదని ఆ పనులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కి అప్పగించిన సమయంలోనే.. ఆ సంస్థతో ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. అప్పటినుంచి హాల్‌టికెట్ల జనరేషన్, ఆన్‌లైన్లో ప్రాక్టికల్ మార్కుల అంశం సరిగాచేయలేని సంస్థను ఎందుకు కొనసాగించారని కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికైనా ఈ మొత్తం వ్యవహారం పక్కాగా జరిగేందుకు చర్యలు చేపట్టడంతోపాటు అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ పరీక్షల తరువాత సదరు సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు ఆ సంస్థ చేసుకున్న ఒప్పందం, దాని ప్రకారమే పని చేసిందా? లేదా? అన్న దానిపైనా విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విద్యార్థులకు తక్కువ మార్కులు వేయడం, పరీక్షలకు హాజరైనా గైర్హాజరైనట్లు చూపడం వంటివి సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగానే దొర్లినట్లు స్పష్టమైంది. మరోవైపు త్రిసభ్య కమిటీ కూడా ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసి పూర్తి స్థాయి నివేదికను ఇవ్వనుంది. ఆ తర్వాత సదరు సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ సెలవుపై వెళ్లనున్నట్లు తెలిసింది.