ఆర్టీసీ సమ్మెకు ముగింపు.. సంచలన నిర్ణయం ప్రకటించిన జేఏసీ
రాష్ట్రంలో 48 రోజులుగా కొనసాగిన ఆర్టీసీ సమ్మెకు ముగింపు పడింది. విధుల్లో చేరడానికి సిద్ధమంటూ ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం ప్రకటించింది. జేఏసీ నిర్ణయంతో రాష్ట్రంలో ఇక బస్సులు యథేచ్ఛగా తిరిగే అవకాశం ఏర్పడింది. కార్మికులు విధుల్లో చేరడానికి.. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సానుకూల వాతావరణ కల్పించాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కోరారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ఆయన తెలిపారు. బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని.. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆయన కోరారు. లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కార్మికులు ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయరని.. విధుల్లోకి వెళితే డ్యూటీ చార్టులపై మాత్రమే సంతకాలు చేస్తారని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. జేఏసీ నాయకులు, విపక్ష నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం బుధవారం (నవంబర్ 20) సాయంత్రం ఆర్టీసీ సమ్మెపై ఆయన కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వం, యాజమాన్యం స్పందన తర్వాతే సమ్మెపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. సమ్మె విరమిస్తున్నట్లు నేరుగా ప్రకటన చేయకున్నా.. విధుల్లో చేరడానికి సిద్ధమంటూ అదే అర్థం వచ్చేలా మాట్లాడారు.