ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథం
త్రిసభ్య కమిటీతో గురువారం జరిపిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 5 నుంచి సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేందుకు సమ్మె చేసి తీరతామని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వమే కార్మికులను సమ్మెలోకి నెట్టిందని.. వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు లేవని ఆరోపించారు. ఎస్మా వంటి చట్టాలు ప్రయోగించినా భయపడబోమని అన్నారు. సీఎం భేషజాలకు పోకుండా డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
త్రిసభ్య కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రేపు ఆర్టీసీ ఐకాసతో మళ్లీ సమావేశం అవుతామని తెలిపారు. కార్మికులు తమ మాట వినకుండా సమ్మెకు వెళ్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని సునీల్ శర్మ చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని భరోసానిచ్చారు. అవసరమయితే.. ఎస్మా చట్టం కూడా ప్రయోగిస్తామని స్పష్టం చేశారు.